హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): చైనాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ దిగ్గజం బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్).. తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏదీ లేదని ప్రకటించింది. హైదరాబాద్‌లో 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈవీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఈ మేరకు టెక్ఇన్ఏషియా.కామ్ చెప్తున్నది. అలాగే తమ వుయ్‌చాట్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ అధికారిక ప్రకటనలో ఈ వార్తలన్నీ అబద్ధాలని బీవైడీ సైతం పేర్కొనడం గమనార్హం. కాగా, చైనా ప్రముఖ బిజినెస్ మీడియా సంస్థ యికై గ్లోబల్ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. దీంతో యికై చైనాలోని అత్యంత ప్రధాన బిజినెస్ మీడియా కావడంతో ఈ అంశాన్ని కొట్టిపారేయలేమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
బీవైడీ ఇప్పటికే మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) గ్రూప్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నది. మెఘా కంపెనీకి చెందిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి బీవైడీ సహకరిస్తున్నది. దీంతో తెలంగాణలో బీవైడీ కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు 2020లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. నాటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఏటా 10,000-15,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలనే ప్రణాళికల్ని బీవైడీ రూపొందించింది. కానీ భారత్-చైనా సరిహద్దుల మధ్య ఏర్పడిన ఉద్రిక్తకర పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం దేశంలోకి చైనా కంపెనీల రాకపై కఠిన ఆంక్షలు విధించింది.
ఈ నేపథ్యంలో బీవైడీ తెలంగాణకు వచ్చే ప్రతిపాదన అటకెక్కింది. అయితే ఇటీవల భారత్-చైనా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవుతున్న తరుణంలో మళ్లీ బీవైడీ తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నదన్న ప్రచారం జోరందుకున్నది. పైగా మార్కెట్లో బీవైడీకి పోటీదారుగా ఉన్న అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఏపీలో పెట్టుబడి పెట్టనున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకున్నది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒలెక్ట్రా పరిశ్రమకు సమీపంలోని సీతారాంపూర్‌లో 150 ఎకరాలు లేదా షాబాద్ మండలంలోని చందన్‌వల్లి వద్ద 200 ఎకరాల భూమిని బీవైడీ కోసం ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అంతేగాక షాద్‌నగర్ వద్ద ఏర్పాటవుతున్న బ్యాటరీల పరిశ్రమకు సమీపంలోనే బీవైడీకి భూములు కేటాయించే వీలుందని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ వార్తల్ని బీవైడీ ఖండించినట్టు బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది.
బీవైడీ రాష్ర్టానికి వస్తుందని, అయితే ఇప్పుడే దీనికి సంబంధించి అధికారికంగా వెల్లడించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే బీవైడీ ఈ వార్తలను ఖండించడంపై మాట్లాడేందుకు వారు నిరాకరిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి పరిశ్రమలు రాష్ర్టాన్ని వీడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే పలు పరిశ్రమలు రాష్ర్టాన్ని వీడగా.. బీవైడీ కూడా వెనుకడుగు వేస్తున్నదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.