న్యూఢిల్లీ, మే 11: టర్నోవర్ రూ.5 కోట్లు దాటితే వ్యాపార సంస్థలు తమ బిజినెస్ టు బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ (ఈ-ఇన్వాయిస్)ను తీసుకోవాల్సిందే. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం రూ.10 కోట్లు, ఆపై టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకే ఈ-ఇన్వాయిస్ అవసరం. అయితే ఈ పరిమితిని సగానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం కింద B2B లావాదేవీల కోసం వ్యాపార సంస్థలకు 2020 అక్టోబర్ 1 నుంచి ఈ-ఇన్వాయిస్ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. కాగా, మొదట్లో రూ.500 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలకే ఈ-ఇన్వాయిస్ను మోదీ సర్కారు పరిమితం చేసింది. ఆ తర్వాత దాన్ని రూ.100 కోట్లకు, రూ.50 కోట్లకు, రూ.20 కోట్లకు, రూ.10 కోట్లకు తగ్గిస్తూ వచ్చింది. ఇప్పుడు దీన్నీ రూ.5 కోట్లకు తేనున్నారు.