Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లో బుల్ పరుగులు తీసింది. అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో మంగళవారం పాజిటివ్ దృక్పథంతో ట్రేడింగ్ జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 456 పాయింట్ల లబ్ధితో 60,571 పాయింట్లకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 133 పాయింట్లు పుంజుకుని 18,070 వద్ద ముగిసింది. బ్రాడర్ నిఫ్టీ-50 సూచీ నాలుగు నెలల తర్వాత తిరిగి 18 వేల మార్క్‌ను దాటింది. ఆర్థిక, ఫైనాన్సియల్ సేవల సంస్థల షేర్లు పుంజుకోవడం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది.
దీనికి తోడు లండన్‌లో మంగళవారం ఉదయం 10.24 గంటల సమయానికి స్టాక్ యూరప్-600 0.2%, ఎస్ అండ్ పీ-500 0.4 %, నాస్డాక్-100 0.3 శాతం డోజోన్స్ ఇండస్ట్రీయల్ ఫ్యూచర్స్ 0.3 శాతం, ఎంఎస్సీఐ ఆసియా పసిఫిక్ ఇండెక్స్ 0.6 శాతం పుంజుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్-30లో 23, నిఫ్టీ-50లో 34 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్ షేర్లు లాభ పడ్డాయి. మరోవైపు శ్రీ సిమెంట్, సిప్లా, ఎచిర్ మోటార్స్, టీసీఎస్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో స్క్రిప్ట్‌లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.3 శాతం, ఫైనాన్సియల్ సర్వీసెస్ 0.9, బ్యాంక్ ఇండెక్స్ 0.71 శాతం లాభపడ్డాయి.
ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కలవర పరుస్తున్నా.. దేశీయ డెట్, ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రావడంతో ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.79.1475 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్ ఇంట్రా డే ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి విలువ ఐదు నెలల గరిష్టస్థాయి రూ.79.0350కి చేరుకున్నది.