BSNL | దేశీయ ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు తమ యూజర్ల ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు పెంచేశాయి. దీంతో అందరూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు చూస్తున్నారు. ఇతర టెలికం సంస్థలతో పోలిస్తే నెలవారీ, త్రైమాసికం, వార్షిక టారిఫ్ ప్లాన్ల ధరలు తక్కువగా ఉండటంతో మొబైల్ ఫోన్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. నెలవారీ కనీస చార్జీల ధరల పెంపు నేపథ్యంలో కేవలం ఇన్ కమింగ్ కాల్స్ కోసం ఫోన్లు వాడే వారు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నెల మూడో తేదీ నుంచి జియో, ఎయిర్ టెల్, నాలుగో తేదీ నుంచి వొడాఫోన్ ఐడియా తమ యూజర్ల ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల టారిఫ్ చార్జీలు పెంచేశాయి. నాటి నుంచి బీఎస్ఎన్ఎల్ సబ్ స్క్రైబర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏనెలకానెల సబ్ స్క్రైబర్లను కోల్పోతున్న బీఎస్ఎన్ఎల్.. కొత్త సబ్స్క్రైబర్లను చేర్చుకోవడం సానుకూల పరిణామం అని అంటున్నారు. గత రెండు వారాల్లోనే ఇతర టెలికం సంస్థల నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్ సంస్థకు 2.50 లక్షల మంది మారినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో 25 లక్షల మంది కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నారని ఆ వర్గాల కథనం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు విక్రయ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
ప్రైవేట్ టెలికం సంస్థలు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా బెనిఫిట్లతో 28 రోజులకు రూ.189, రూ.199 వసూలు చేస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ కేవలం 108లకే ఈ బెనిఫిట్లు కల్పిస్తున్నది. అయితే, ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్లో 4జీ సేవలు అందుబాటులో లేకపోవడం ప్రతికూల అంశం అని చెబుతున్నారు. టెలికం చార్జీల పెంపుతో కొందరు ఇప్పటికిప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నా, ఇది తాత్కాలికమేనని అంటున్నారు. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 4జీ, 5జీ సేవలు అందించగలిగినప్పుడే బీఎస్ఎన్ఎల్ నిలదొక్కుకోగలదని విశ్లేషకులు చెబుతున్నారు.