ముంబై, అక్టోబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కూడా నష్టాలను మరింత పెంచాయి. ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు వారాంతం మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 344.52 పాయింట్లు కోల్పోయి 84,211.88 వద్ద ముగిసింది.
2,323 షేర్లు నష్టపోగా, 1,853 షేర్లు లాభాల్లో ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ కూడా 96.53 పాయింట్లు కోల్పోయి 25,795.15 వద్ద స్థిరపడింది. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 259.69 పాయింట్లు, నిఫ్టీ 85.3 పాయింట్ల చొప్పున అధికమయ్యాయి. సూచీల్లో హిందుస్థాన్ యూనిలీవర్ అత్యధికంగా 3.20 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై తొందరపడటం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్, సర్వీసెస్ రంగ షేర్లు నష్టపోయాయి. కానీ, మెటల్, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, ఎనర్జీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
తొలి ఏఐ ఆధారిత గవర్నెన్స్ సంస్థ ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యుషన్స్ లిమిటెడ్ శుక్రవారం బీఎస్ఈలో లిస్టింగ్ అయింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రాజా శ్రీనివాస్ ఓపెనింగ్ బెల్‌ను మోగించి అధికారికంగా ట్రేడింగ్ ప్రారంభించారు. కంపెనీ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, తమ వ్యాపారాన్ని ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, ఫుడ్ రంగాల్లో విస్తరించనున్నట్టు చెప్పారు.