దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనైనా.. ఓవరాల్‌గా లాభాలనే అందుకున్నాయి. ఆల్‌టైమ్ హైల్లోనూ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే మొగ్గు చూపారు. దీంతో ఈక్విటీ మార్కెట్లు మునుపెన్నడూ లేని స్థాయిల్లోనే స్థిరపడ్డాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 522.74 పాయింట్లు ఎగిసి 80 వేలకు ఎగువన 80,519.34 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 178.30 పాయింట్లు ఎగబాకి 24,502.15 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్ 80,500 మార్కును, నిఫ్టీ 24,500 స్థాయిని దాటి ఆగడం ఇదే తొలిసారి. ఇక ఈ వారం మదుపరులు ఆయా సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే వీలున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌కు కంపెనీలు తమ ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ను ప్రకటిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్ సరళిని ఇవి అత్యంత ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.
కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 24,700-24,900 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.