న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దివ్యాంగులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, మానసిక రోగుల కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను అందుబాటులోకి తేవాలని జనరల్, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్స్‌కు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సూచించింది. అలాగే ఐఆర్డీఏఐ (హెల్త్ ఇన్సూరెన్స్) రెగ్యులేషన్స్, 2016 ప్రకారం పాలసీల ధరలను నిర్ణయించాలని కూడా తాజాగా విడుదల చేసిన ఓ సర్క్యులర్‌లో పేర్కొన్నది. కంపెనీ బోర్డు సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుని పాలసీలను వీలైనంత త్వరగా మార్కెట్లోకి విడుదల చేయాలని కూడా చెప్పింది. ఇక పాలసీ వ్యవధి తప్పకుండా ఏడాది ఉండాలని, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగానే రూపొందించాలని వెల్లడించింది.