న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అదానీ గ్రూప్ ఆర్థికంగా చాలా పటిష్టంగా, సురక్షితంగా ఉందని బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ చెప్పారు. ఒక న్యూస్చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్రూప్ రుణభారం పట్ల వ్యక్తమవుతున్న ఆందోళనల్ని కొట్టివేశారు. అదానీ గ్రూప్ రుణాలపై ‘గగ్గోలు’ చేస్తున్నవారు తమ ఆర్థికాంశాలను లోతుగా పరిశీలించకుండా, స్వార్థప్రయోజనాలతో గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. తమ రుణం పెరుగుదల రేటుకంటే గ్రూప్ లాభం రెండింతలు వృద్ధిచెందుతున్నదని, దీంతో డెట్ టు ఇబిటా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు లాభంతో పోలిస్తే రుణం) నిష్పత్తి 7.6 నుంచి 3.2కు తగ్గించామని అదానీ వివరించారు.
మాంద్యాన్ని తట్టుకునేలా బడ్జెట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడవచ్చన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావాన్ని భారత్ తట్టుకునే రీతిలో వచ్చే కేంద్ర బడ్జెట్ ఉంటుందన్న ఆశాభావాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ వ్యక్తం చేశారు. ఇందుకోసం ఉపాధి కల్పన, సామాజిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మూలధన వ్యయాలపై బడ్జెట్ దృష్టి సారించాలని సూచించారు.