న్యూఢిల్లీ : ఉద్యోగులతో నెల రోజుల పాటు పని చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చేందుకు పలువురు యజమానులు తటపటాయిస్తుంటారు. ఉద్యోగుల శ్రమకు సరైన విలువ కల్పించేందుకు వెనుకాడుతుంటారు. వేతన పెంపు అంటేనే ఉలిక్కిపడే బాస్‌లు ఉన్న రోజుల్లో ఓ బిలియనీర్ బాస్ ఉద్యోగులకు ఖుషీ కబురు అందించి ఉక్కిరిబిక్కిరి చేశాడు. తన వద్ద పనిచేసే 1200 మంది ఉద్యోగులకు ఏకంగా టోక్యో డిస్నీల్యాండ్‌లో (Disneyland) మూడు రోజుల ట్రిప్‌ను ఆఫర్ చేశాడు.
మల్టీనేషనల్ హెడ్జ్ ఫండ్ సిటాడెల్ ఎల్ఎల్సీ, సిటాడెల్ సెక్యూరిటీస్ సీఈవో కెన్ గ్రిఫిన్ తన ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించాడు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులూ డిస్నీల్యాండ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసి బాస్ అంటే ఇలా ఉండాలని చెప్పుకున్నారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకూ మూడు రోజుల పాటు ఈ లగ్జరీ లొకేషన్లో కంపెనీ వార్షికోత్సవాలను నిర్వహించారు. హాంకాంగ్, సింగపూర్, సిడ్నీ, షాంఘై, టోక్యో, గురుగ్రాం వంటి ఆరు కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఉద్యోగులందరూ తమ జీవిత భాగస్వాములు, పిల్లలతో కలిసి టోక్యో డిస్నీల్యాండ్, డిస్నీసీను సందర్శించారు. ఈ వేడుకల్లో బ్యాండ్ మెరూన్ 5, స్కాటిష్ డీజే కెవిన్ హారిస్‌లు తమ పెర్ఫామెన్స్‌తో ఉర్రూతలూగించారు. ఇక రవాణా ఖర్చులు, హోటల్స్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, డిస్నీ టికెట్లు, పిల్లల సంరక్షణ ఖర్చు మొత్తం బిలియనీర్ బాస్ భరించాడు. ఈరోజు కంపెనీలో నైపుణ్యాలకు కొదవలేదని, ఇలాంటి టాలెంట్‌తో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని వార్షిక వేడుకలో కంపెనీ బాస్ కెన్ గ్రిఫిన్ చెప్పుకొచ్చాడు. గత ఏడాది అమెరికా, యూరప్ ఉద్యోగులను సైతం ఇలాంటి ఎగ్జైటింగ్ ఆఫర్‌తో కంపెనీ ఖుషీ చేసింది.
Read More :
iPhone Hacking: 150 దేశాలకు ఆ అడ్వైజరీ ఇచ్చారు.. హ్యాకింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం