Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగింది. అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించడంతో లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 78వేల మార్క్ ఎగువన ముగియగా.. నిఫ్టీ 24వేల పాయింట్లకు చేరువైంది. ఉదయం నష్టాల్లో మార్కెట్లు మొదలైనా.. ఆ తర్వాత కోలుకున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లతో ర్యాలీ కొనసాగింది. క్రితం సెషన్ (77,044.29)తో పోలిస్తే సెన్సెక్స్ 76,968.02 పాయింట్ల నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో ఈ క్రమంలో సెన్సెక్స్ 76,665.77 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి.
ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో 78,616.77 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1,508.91 పాయింట్లు పెరిగి.. 78,553.20 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 414.45 పాయింట్లు పెరిగి.. 23,851.65 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,340 షేర్లు లాభపడగా.. 1,468 షేర్లు పతనమయ్యాయి. టెలికాం, పీఎస్‌యూ, బ్యాంక్, ఆయిల్, గ్యాస్, ఫార్మా, ఆటో, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్ ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక్కొక్కటి 0.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎటర్నల్ లాభాలను ఆర్జించాయి. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి.