హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): భూతాపం ఆధారంగా విద్యుదు త్పత్తికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరును జియోథర్మల్ క్షేత్రంగా అభివృద్ధి చేయనున్నారు. అక్కడ 122 మోగావాట్ల జియోథర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మూడు సంస్థలు సిద్ధమవుతున్నాయి.
మణుగూరు సమీపంలోని పగిడేరు వద్ద ఏర్పాటు చేయడానికి శుక్రవారం సింగరేణి, ఓఎన్జీసీ, తెలంగాణ రెడ్కోల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీనికి సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మారావత్, రెడ్కో జీఎం సత్యవరప్రసాద్లు హాజరయ్యారు.
ఇప్పటికే 20 కిలోవాట్ల విద్యుదుత్పత్తికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమవ్వగా, 122 మెగావాట్లకు వీలుందని ఓఎన్జీసీ నివేదిక వెల్లడించింది. మరికొన్ని పరిశోధనల్లో 3,500 మోగావాట్ల వరకు జియోథర్మల్ విద్యుదుత్పత్తికి అవకాశమున్నట్లుగా తేలింది.
రోజుకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి సీఎండీ బలరాం అధికారులను ఆదేశించారు. రోజుకు 13.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించాలని, రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు.