Nasscom | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభా పాటవాలపై నాస్కామ్ చైర్ పర్సన్ సింధూ గంగాధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరంగా టెక్నాలజీ రంగం పరివర్తనలో భారత్ కీలకంగా ఉంటుందన్నారు. ఏఐ ప్రతిభా పాటవాల్లోనూ, డొమైన్ స్కిల్స్లోనూ భారత్ నాయకత్వ స్థానం వహిస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐలతో వివిధ టెక్నాలజీ, ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల మెరుగుదలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ సంస్థలు కూడా తమ సంస్థాగత సంస్కృతిలో సిబ్బంది భౌతిక, మానసిక పరిస్థితి మెరుగ్గా ఉండేలా చూసుకోవాల్సి ఉందని కూడా సింధూ గంగాధరన్ స్పష్టం చేశారు.
కార్పొరేట్ ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగుల్లో నిరంతరం ఒత్తిడి పెరిగిపోతుందన్న ప్రచారానికి చెక్ పెట్టాలని తెలిపారు. ఇటీవల ఓ కన్సల్టెన్సీ సంస్థలో యువ ప్రొఫెషనల్ విషాదకరమైన రీతిలో మరణించిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మున్ముందు భారత్ ‘జీసీసీ (గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు) క్యాపిటల్ ఆఫ్ వరల్డ్’గా నిలుస్తుందని సింధూ గంగాధరన్ పేర్కొన్నారు. ఏఐ నైపుణ్యం, ప్రతిభలో భారత్ తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుందన్నారు. ఇండియన్ టెక్నాలజీ పరిశ్రమ ‘బుల్లిష్’గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో నాస్కామ్ చైర్ పర్సన్ గా సింధూ గంగాధరన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఐ వల్ల ఉద్యోగాల కోతలు ఉంటాయన్న విషయమై ఆమె స్పందిస్తూ.. ‘న్యూ ఏజ్ టెక్నాలజీల సాయంతో ఉత్పాదక లాభాలు గడించాలి. కీలక సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలు అన్వేషించాలి’ అని వ్యాఖ్యానించారు.