మార్కెట్ పల్స్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 పాయింట్లు నష్టపోయింది. దీంతో గత వారం లాభాలు కనుమరుగై అంతిమంగా 617 పాయింట్ల నికర నష్టంతోనే ముగిసింది. అన్ని రంగాల ఇండెక్స్‌లు కూడా 2.5 నుంచి 5 శాతం వరకు నష్టపోయాయి.
గత వారం పతనం కారణంగా టెక్నికల్ మార్కెట్ దీర్ఘకాల డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశించినైట్టెంది. డబుల్ టాప్, హెడ్ అండ్ షోల్డర్, డిసెండింగ్ ట్రయాంగిల్ వంటి ప్యాట్రన్లు అన్నీ బ్రేక్‌డౌన్ అయ్యాయి. దీనికితోడు స్వల్ప, దీర్ఘకాల చలన సగటులకు దిగువన నిఫ్టీ స్థిరపడింది. ఇవన్నీ మార్కెట్ దీర్ఘకాల డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశించింది అనడానికి నిదర్శనం. మార్కెట్‌ను ముందుండి నడిపించడానికి ఏ రంగమూ బుల్లిష్‌గా కనిపించడం లేదు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు.. మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెలలో ఇప్పటివరకు రూ.41,771.60 కోట్ల అమ్మకాలను జరిపారు. గత ఐదు నెలల్లో రూ.1,84,085.65 కోట్ల మేర షేర్లను అమ్మేశారు. మరోవైపు ఎల్ఐసీ ఐపీవో కోసం కూడా రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తున్నారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్ స్థిరీకరణకు సరిపడినంతగా లేవు. ఇక ఈ వారం మార్కెట్ బ్రేక్‌డౌన్ స్థాయి 16,800 నుంచి 17,000 వరకు రీటెస్ట్ చేయవచ్చు. క్రితం వారం కనీస స్థాయి 16,200.. కొంతకాలంపాటు గట్టి మద్దతు స్థాయిగానే ఉంటుంది. మళ్లీ కనీసం 17,000 స్థాయికి ఎగువన ముగిస్తే.. మార్కెట్ కాస్త రికవరీ దిశగా పయనించవచ్చు. ప్రస్తుతానికి కొత్త కొనుగోళ్లకు అనువైన సమయం కాదు. అలాగే రికవరీ లేదా పుల్‌బ్యాక్ సమయాల్లో సాధ్యమైనంత వరకు లాభాలను స్వీకరించడమే మేలు. ఒడిదుడుకులు, ట్రేడింగ్ రేంజ్‌లు పెరుగుతున్నందున స్వల్పకాలిక ట్రేడింగ్‌కు మార్కెట్ అనువుగా లేదు.