LIC | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ‘69 ఏండ్ల చరిత్ర.. లక్ష మంది ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా రూ. 56 లక్షల కోట్లకు పైగా ఆస్తులు.. కోట్లాది మంది పాలసీదారులు.. అత్యంత శక్తివంతమైన గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ జాబితాలో మూడో ర్యాంకు.. ద్రవ్య నిల్వల్లో నాలుగో అతిపెద్ద బీమా సంస్థగా గుర్తింపు.. ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు.. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికార్డులు ఇవి. అయితే ఇదంతా గతం.. కేంద్రంలోని మోదీ సర్కారు అనాలోచిత విధానాలతో ఎల్ఐసీ భవిష్యత్తు ప్రమాదంలో పడబోతున్నది. ఎల్ఐసీని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం అడుగులు వేయడమే దీనికి కారణంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) పెట్టుబడుల ఉపసంహరణకు అమిత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. బీమా రంగ సంస్థ ఎల్ఐసీపై కూడా దృష్టిసారించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ (ఐఐఎంకే)కు చెందిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సంస్థలో సంస్కరణలు తీసుకురావడానికి అవసరమైన సూచనల కోసమని ఈ బృందాన్ని నియమించింది. దీంతో ఆ బృందం.. లైఫ్ ఇన్సూరెన్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ మెంబర్లతో పాటు ఇతర బీమా సంస్థలతో రెండు రోజులు చర్చలు జరిపి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)కు ఓ నివేదికను సమర్పించింది.
ఆ నివేదిక ప్రకారం.. బీమా రంగంలో ఎల్ఐసీ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నదని, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్ కలెక్షన్లలో 57 శాతం, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్ రెన్యూవల్స్లో 87 శాతం, కొత్త పాలసీల్లో 70 శాతం, కొత్త వ్యాపారాల్లో 59 శాతం వాటా ఎల్ఐసీదేనని పేర్కొన్నది. ఇలాంటి సంస్థను మరింత శక్తిమంతంగా మార్చడానికి, ప్రజలకు అవసరమైన సేవలను మెరుగు పరచడానికి, కార్యకలాపాల సౌలభ్యానికి సంస్థను కొన్ని భాగాలుగా విభజించడమే మంచిదని నివేదిక అభిప్రాయపడింది. అంతేకాదు, 2047 నాటికి దేశ పౌరులందరికీ బీమా సదుపాయాన్ని తీసుకురావాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్ఐసీ విచ్ఛిన్నమే సరైన మార్గమని సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ విచ్ఛిన్నానికి కేంద్రం అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
సంస్థను విచ్ఛిన్నం చేయడం దేశీయ జీవిత బీమా రంగానికి వినాశకరంగా మారుతుందని ఎల్ఐసీ వర్గాలు మండిపడ్డాయి. ఈ చర్యలు 27 కోట్ల మంది పాలసీదారుల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయని అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నది. ఇప్పటికే ప్రైవేటు బీమా సంస్థల పోటీతో తమ మార్కెట్ షేర్ అంతకంతకూ తగ్గిపోతున్నదన్న ఎల్ఐసీ.. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే, తమ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఐఐఎంకే నిపుణుల బృందం ఇచ్చిన నివేదికలోని సిఫారసులు ఎల్ఐసీ వృద్ధికి మేలు చేసేవిగా కాకుండా.. ప్రైవేటు రంగ బీమా సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీమా రంగంలో ఎల్ఐసీ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నదని, దాన్ని ముక్కలు చేయాలని నిపుణుల బృందం సిఫారసు చేయడమే ఇందుకు ఉదాహరణగా వాళ్లు చెప్తున్నారు.
పదుల సంఖ్యలో ఉన్న బ్యాంకులను విలీనం చేస్తూ ఏకరూప బ్యాంకుగా మార్చడాన్ని సమర్థించుకొన్న కేంద్రం.. దానికి వ్యతిరేకంగా ఎల్ఐసీని భాగాలుగా విడగొట్టడం ఏమిటని ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని పూడ్చుకొనేందుకు 2023లో హడావుడిగా ఎల్ఐసీ ఐపీవోను కేంద్రం ప్రవేశపెట్టడం, వివాదాస్పద అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టేలా కేంద్రం ఒత్తిళ్లు తీసుకొచ్చిందన్న ఆరోపణలు రావడం వెరసి.. ఎల్ఐసీపై కేంద్రం అక్కసు ప్రదర్శిస్తున్నదా? అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయపథంలో నడుస్తున్న సంస్థను ముక్కలు చేయడం అంటే బంగారు బాతును చంపడమేనని మండిపడుతున్నారు. డీమర్జింగ్ (విచ్ఛిన్నం) అయిన ఏ ఆర్థిక సంస్థ కూడా ఆ తర్వాతి కాలంలో నిలదొక్కుకోలేకపోయిందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు యూకేకు చెందిన ఈక్విటబుల్ లైఫ్, అమెరికాకు చెందిన ఏఐజీ, జపనీస్ పోస్టల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉదంతాలను ఉదహరిస్తున్నారు.