న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం).. ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రుణ రేటు 7.8 శాతం నుంచి 7.9 శాతానికి చేరుకున్నది. ఈ రేట్లు ఈ నెల 7 నుంచే అమలులోకి వచ్చాయి. అలాగే నెల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ కూడా 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 7.5 శాతానికి చేరుకున్నది. కానీ, ఒక్కరోజు, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటును బ్యాంక్ ముట్టుకోలేదు.
ఎఫ్డీలపై ఐవోబీ వడ్డీరేట్ల పెంపు
ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్.. డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 60 బేసిస్ పాయింట్ల వరకు పెంచిది. పెరిగిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమలులోకి రాను న్నాయి. వీటిలో 444 రోజులు, మూడేండ్లు, అంతకంటే ఎక్కువ రోజుల దేశీయ, నాన్-రెసిడెంట్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.15 శాతానికి చేరుకుంది. 270 రోజుల నుంచి ఏడాది, ఏడాది-మూడేండ్లలోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీనీ 60 బేసిస్ పాయింట్లు సవరించింది.