న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికానికిగాను రూ.920 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.535 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. ఏడాది క్రితం రెండో త్రైమాసికంలో రూ.4,317 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.5,796 కోట్లకు ఎగబాకినట్టు బ్యాంక్ ఎండీ ఏఎస్ రాజీవ్ తెలిపారు. దీంట్లో వడ్డీల ద్వారా రూ.5,068 కోట్ల ఆదాయాన్ని గడించింది. నికర వడ్డీ మార్జిన్ 3.55 శాతం నుంచి 3.89 శాతానికి చేరుకోగా, స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.40 శాతం నుంచి 2.19 శాతానికి దిగొచ్చినట్టు వెల్లడించారు. అలాగే నికర ఎన్పీఏ కూడా 0.68 శాతం నుంచి 0.23 శాతానికి దిగొచ్చింది. మరో రెండు త్రైమాసికాల వరకు డిపాజిట్లు, రుణాలపై వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.