న్యూఢిల్లీ, జనవరి 10: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు అధికంకానున్నది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 20 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ రేటు 8.3 శాతం నుంచి 8.5 శాతానికి చేరుకోనున్నది. అలాగే నెల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతం నుంచి 8.15 శాతానికి, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు కూడా 8.05 శాతం నుంచి 8.15 శాతానికి పెంచిన బ్యాంక్..ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు కూడా 8.25 శాతం నుంచి 8.35 శాతానికి సవరించింది. దీంతో రిటైల్, గృహ, వ్యక్తిగత, ఎస్ఎంఈఎస్లు తీసుకున్న రుణాలపై అధిక భారం పడనున్నది.