Bajaj Housing | కొత్తగా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండో రోజు మంగళవారం మరో రికార్డు నమోదు చేశాయి. మంగళవారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 10 శాతం వృద్ధితో అప్పర్ సర్క్యూట్ లిమిట్‌ను తాకింది. బీఎస్ఈలో సంస్థ షేర్ 10 శాతం పుంజుకుని రూ.181.48, ఎన్ఎస్ఈలో 10 శాతం వృద్ధితో రూ.181.50 వద్ద ఒక రోజు గరిష్ట పరిమితిని దాటేసింది. దీంతో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,733.12 కోట్లు పెరిగి రూ.1,51,139.21 కోట్లకు చేరుకున్నది. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం ఇష్యూ ధర రూ.70 నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ విలువ 159.28 శాతం వృద్ధి చెందింది. తద్వారా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రూ.49,056.56 కోట్లతో రెండో స్థానంలోకి చేరింది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఎం-క్యాప్ రూ.37,239.27 కోట్లతో మూడో స్థానానికి, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ రూ. 27,333.34 కోట్లతో నాలుగో స్థానానికి, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ రూ.19,531.62 కోట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాయి. అప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్ ఎం-క్యాప్ రూ.16,638.12 కోట్లు, ఆవాస్ ఫైనాన్సియర్స్ రూ. 14,461.15 కోట్లతో, సమ్మాన్ క్యాపిటల్ రూ.11,816.40 కోట్లతో, క్యాన్ ఫిన్ హోమ్స్ రూ. 11,717.56 కోట్లతో, హోం ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ రూ.10,419.52 కోట్లతో తర్వాతీ స్థానాలకు చేరుకున్నాయి.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లిస్టయ్యాయి. లిస్టయిన తొలి రోజే ఇష్యూ ధర 70పై భారీ ప్రీమియంతో అంటే దాదాపు 136 శాతం వృద్ధితో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ స్థిర పడింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లోనూ సంస్థ షేర్ రూ.150లకు చేరుకున్నది. ఇష్యూ ధర నుంచి 114.28 శాతం వృద్ధి చెందింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ రూ.6,560 కోట్లతో ఐపీఓకు వెళ్లింది. ఈ నెల 11తో ముగిసిన ఐపీఓలో సంస్థ షేర్ 63.60 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.