Akasa Air – DGCA | ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఆకాశ ఎయిర్’కు విమానయాన నియంత్రణ సంస్థ ‘డీజీసీఏ’ షాక్ ఇచ్చింది. గత సెప్టెంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో కొందరు ప్రయాణికుల బోర్డింగ్‌కు పరిహారం ఇవ్వడంలో విఫలమైంది ఆకాశ ఎయిర్. అందుకు ఆకాశ ఎయిర్ యాజమాన్యానికి డీజీసీఏ రూ.10 లక్షల జరిమాన విధించింది. కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలపై ఆకాశ ఎయిర్ మీద డీజీసీఏ నిఘా పెట్టింది. పైలట్ల శిక్షణలో నిబంధనలు పాటించడం లేదని డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారం అని ఆకాశ ఎయిర్ తెలిపింది.
గత సెప్టెంబర్ ఆరో తేదీన బెంగళూర్ నుంచి పుణె వెళ్లేందుకు ఏడుగురు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే అదే రోజు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సర్వీసు మార్చారు. దరిమిలా ఏడుగురు ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించింది ఆకాశ ఎయిర్. దీంతో సదరు ప్రయాణికులు ఇండిగో విమానంలో షెడ్యూల్డ్ టైం కంటే గంటన్నరకు పైగా ఆలస్యంగా అంటే రాత్రి 10.40 గంటలకు పుణెకు చేరుకున్నారు.
ఈ విషయమై డీజీసీఏ ప్రమాణాలకు అనుగుణంగా సదరు ప్రయాణికులకు పరిహారం చెల్లించలేదని సమాచారం. దీనిపై డీజీసీఏ నోటీసుకు స్పందించిన ఆకాశ ఎయిర్.. సదరు ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించడాన్ని సమర్థించుకున్నది. సంబంధిత ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఈ నెల 23న ఆకాశ ఎయిర్ యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు ఆకాశ ఎయిర్ మీద రూ.10 లక్షల ఫైన్ విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.