Homes | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా సగటున 12 శాతం ధరలు వృద్ధి చెందాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గరిష్టంగా 30 శాతం ఇండ్ల ధరలు పెరిగాయని క్రెడాయ్, రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ కొల్లియర్స్, డెటా అనలిటిక్స్ సంస్థ లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక తెలిపింది.
ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగం పాజిటివ్ గా ఉందని క్రెడాయి్ అధ్యక్షుడు బొమన్ ఇరానీ తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో ఎస్ఎఫ్టీ ధర ఏడు శాతం వృద్ధితో రూ.10,530 నుంచి రూ.11,290లకు చేరుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 13 శాతం ధరలు పెరిగాయి. గతేడాది జూన్ త్రైమాసికంలో ఒక ఎస్ఎఫ్టీ రూ.6505 పలికితే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.7,355లకు పెరిగింది.
ఢిల్లీ తర్వాతీ స్థానంలో కర్ణాటక రాజధాని బెంగళూరు నిలిచింది. బెంగళూరులో ఇండ్ల ధరలు 28 శాతం పెరిగాయి. గతేడాది జూన్ త్రైమాసికంలో ఒక ఎస్ఎఫ్టీ రూ.8688 ఉంటే 2024-25లో రూ.11,161లకు చేరాయి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఆరు శాతం ధరలు పెరిగాయి. గతేడాది రూ.7315 పలికిన ఒక ఎస్ఎఫ్టీ.. ఈ ఏడాది రూ.7,745లకు చేరుకున్నది. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలోనూ ఆరు శాతం ధరలు పెరిగాయి. ఎంఎంఆర్ పరిధిలో ఒక ఎస్ఎఫ్టీ ధర రూ.19,111 నుంచి రూ.20,275లకు చేరుకున్నది. పుణెలో ఒక ఎస్ఎఫ్టీ ధర 13 శాతం వృద్ధి చెందింది. గతేడాది రూ.8,540 పలికితే ఈ ఏడాది రూ.9,656లకు దూసుకెళ్లింది.
ఇక తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఇండ్ల ధరలు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఇండ్ల ధరలు పెరిగినా సేల్స్ లో వృద్ధి రేటు నమోదవుతుందని లియాసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ తెలిపారు. గత కొన్ని త్రైమాసికాలుగా ఇండ్ల మార్కెట్ ఆరోగ్యకరమైన పురోగతి సాధిస్తోందని కొల్లియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యాగ్నిక్ తెలిపారు. సుస్థిరంగా వడ్డీరేట్లు కొనసాగడంతోపాటు బడ్జెట్ లో రాయితీలు ప్రకటించడంతో హౌసింగ్ మార్కెట్ పుంజుకుంటున్నదన్నారు.