Aurobindo Pharma | హైదరాబాద్, ఆగస్టు 10:ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.919 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.571 కోట్ల లాభంతో పోలిస్తే 61 శాతం వృద్ధిని కనబరిచింది.
కంపెనీ విక్రయాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణమని వెల్లడించింది. ఏడాది క్రితం రూ.6,851 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.7,567 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా వైస్-చైర్మన్, ఎండీ కే నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ..గత త్రైమాసికంలో బలమైన వృద్ధిని కనబరిచినట్లు, ముఖ్యంగా అన్ని విభాగాల్లో అత్యధిక వృద్ధిని సాధించినట్లు చెప్పారు.
గ్రాస్ మార్జిన్లు పెరగడం వల్లనే లాభాల్లో అత్యధిక వృద్ధి నమోదైందని, 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరంలో అంచనాలకుమించి రాణిస్తామన్నా ధీమాను ఆయన వ్యక్తంచేశారు.