ముంబై, ఆగస్టు 25 : భారత్-అమెరికా మధ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు సఫలం కాగలవన్న ఆశాభావాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యక్తం చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొనుగోళ్లకుగాను దేశీయ ఎగుమతులపై 25 శాతం జరిమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. దీంతో అగ్రరాజ్యంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై సుంకాల భారం 50 శాతానికి చేరబోతున్నది. ఇప్పటికే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం ఆలస్యానికిగాను వేసిన 25 శాతం టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి మరి. ఈ క్రమంలోనే ఇరు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆకాంక్షను సోమవారం ఇక్కడ ఫిక్కి, ఐబీఏ (ఫిబక్) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కనబర్చారు. వాణిజ్య చర్చలు సఫలమైతే భారత ఆర్థిక వ్యవస్థపై టారిఫ్‌ల ప్రభావం తగ్గొచ్చన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌పై 50 శాతానికి పెరిగితే వస్త్ర, రొయ్యల ఎగుమతులు ఖరీదెక్కనున్నాయి. ఇదే జరిగితే దేశంలో ఆయా రంగాలపై ఆధారపడ్డ వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగులు, రైతులు ఇబ్బందుల్లో పడ్డట్టేనన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి.
దేశంలో ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధిరేటు రెండింటిపైనా ఆర్బీఐ దృష్టి పెడుతుందని, వాటికి అనుగుణంగానే తమ ద్రవ్య విధానం కొనసాగుతుందని ఈ సందర్భంగా మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ ఏడాది మొదలు ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీరేటైన రెపో రేటును ఆర్బీఐ క్రమేణా తగ్గిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఇప్పటిదాకా 4 ద్రవ్య సమీక్షలు జరుగగా.. మూడింటిలో 1 శాతం రెపో రేటు దిగింది. ఈ నెల సమీక్షలో మాత్రం యథాతథంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో ఇక రాబోయే ద్రవ్య సమీక్షల్లో కేవలం జీడీపీ బలోపేతంపైనేగాక, ధరల అదుపు కోణంలోనూ ఆలోచించి నిర్ణయాలుంటాయని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. అమెరికా టారిఫ్‌లు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకుతోడు ద్రవ్యోల్బణం అంశాలూ ఆర్బీఐ ముందు కీలకంగా ఉన్నాయంటున్నారు.
వృద్ధి లక్ష్యాలను ఆర్బీఐ విస్మరించట్లేదన్న మల్హోత్రా.. టారిఫ్‌లు, భౌగోళిక-రాజకీయ ఆందోళనల నుంచి సవాళ్లు ఎదురవుతున్న దృష్ట్యా కార్పొరేట్లు, బ్యాంకులు కలిసి పెట్టుబడులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ఆర్థికాభివృద్ధికున్న అవకాశాలను వదులుకోలేమని, ఆర్థిక విస్తరణకున్న అన్ని మార్గాలనూ మరింత పెంచుకోవాలని సూచించారు. అందుకే బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు, కార్పొరేట్ల పనితీరు అత్యుత్తమంగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు దన్నుగా నిలవాలని చెప్పారు.
కార్పొరేట్ల నుంచి రుణాల డిమాండ్ తగ్గిందని ప్రభుత్వ రంగ ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. నేడు మెజారిటీ కార్పొరేట్ సంస్థలు ప్రైవేట్ క్రెడిట్పట్ల ఆసక్తి చూపిస్తున్నాయని, నిధుల సమీకరణ కోసం క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. దీంతో దేశ వృద్ధి లక్ష్యాల సాధన కోసం పెద్ద ఎత్తున వచ్చే పెట్టుబడులకు దన్నుగా నిలవడానికి బ్యాంకు లు చూస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే బ్యాంకులపైనున్న కొన్ని రకాల ఆంక్షలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా సానుకూలంగా స్పందించారు.
భారతీయ బ్యాంకింగ్ రంగం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లేదా ఏఐ)తో కొత్తరూపును సంతరించుకోగలదని ఓ నివేదిక అభిప్రాయపడింది. ఉద్యోగాలపై ఏఐ ప్రభావంపట్ల ఆందోళనలు కనిపిస్తున్న వేళ ఇదిప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని దక్కించుకుంటున్నది. కాగా, బ్యాంకులు ఏఐని అందిపుచ్చుకుంటే ఎన్నో లాభాలను పొందగలవని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఈ రిపోర్టులో పేర్కొన్నది. గడిచిన దశాబ్ద కాలంలో బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై చేసే ఖర్చులు ఐదింతలు పెరిగాయని, ఉత్పత్తిలో అందుకు ఒనగూరిన లాభం మాత్రం 1 శాతమేనని గుర్తుచేసింది. అయితే ఏఐతో ఈ తరహా నష్టాలను అధిగమించవచ్చని చెప్పింది. నిజానికి ఇప్పటికే అనేక బ్యాంకులు ఏఐ సాధనాలు వినియోగిస్తున్నాయని తెలిపింది.