Audi : ఇటలీ-స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఆదివారం పర్వతారోహణ చేస్తూ ఆడి ఇటలీ బాస్ ఫబ్రిజియో లోంగొ (62) మరణించారు. పదివేల అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆయన ప్రాణాలు విడిచారు. పర్వతారోహణను ఇష్టపడే లోంగొ తరచూ ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. లోంగొ సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సేఫ్టీ ఎక్విప్మెంట్ను కలిగిఉన్నప్పటికీ ఈ విషాదం చోటుచేసుకుంది.
లోంగొ పడిపోవడం గమనించిన మరో క్లైంబర్ వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించారు. ఆపై లోంగొ మృతదేహాన్ని హెలికాఫ్టర్ టీం 700 అడుగుల లోతైన లోయలో గుర్తించింది. ఘటనా స్ధలంలోనే లోంగొ మరణించారని అధికారులు ప్రకటించారు. లొంగో మృతదేహాన్ని సమీప పట్టణమైన కరిసొలోకు తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే వివరాలను తెలుసుకునేందుకు స్ధానిక అధికారులు విచారణను చేపట్టారు.
లోంగొ 2012లో ఆడిలో చేరి ఆపై ఏడాదికే ఇటలీ డివిజన్ హెడ్‌గా పదోన్నతి పొందారు. 1987లో ఆటోమొబైల్ పరిశ్రమలో లోంగొ తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆపై ఆయన ఫియట్, లాన్షియా వంటి ప్రముఖ బ్రాండ్లలో పనిచేశారు. గొప్ప నాయకుడిని కోల్పోయామని లోంగొ మృతిపై ఆడి ప్రతినిధి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నమ్మే విలువలు, ప్రతి ఒక్కరి పట్ల చూపే శ్రద్ధ ఆడిని గౌరవప్రదమైన పని ప్రదేశంగా మార్చాయని అన్నారు.
Read More :