ATF price Hike | విమాన ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర గురువారం 16శాతం పెరిగింది. ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి ధర పెరగడంతో విమాన ప్రయాణం మరింత ప్రియంకానున్నది. ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ.19,757.13 పెరగడంతో ప్రస్తుతం కిలో లీటర్‌కు దేశ రాజధాని ఢిల్లీలో రూ.1,41,232.87 (లీటర్‌కు రూ.141.2)కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఏటీఎఫ్ ధర ప్రస్తుతం కిలో లీటర్‌కు రూ.1,40,092.74, కోల్‌కతాలో రూ.1,46,322.23, చెన్నైలో రూ.1,46,215.85కి పెరిగింది. ఇదిలా ఉండగా.. గురువారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 119.16 అమెరికన్ డాలర్లు పలుకుతున్నది.
జెట్ ఇంధన ధరల పెరుగుదలతో విమానయాన సంస్థల నిర్వహణ వ్యయం పెరగనున్నది. జెట్ ఇంధనం ధరలు పెరుగుదల కారణంగా విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌లైన్ నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ 40 శాతం వరకు ఉంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ సరఫరాపై ఆందోళనలు, కరోనా మహమ్మారి అనంతరం పరిస్థితుల అనంతరం ప్రస్తుతం పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో డిమాండ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. భారత్ చమురు అవసరాలను తీర్చుకునేందుకు 85శాతం దిగుమతి చేసుకుంటున్నది.