న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2023లో రిలయన్స్ జియో.. భారతీ ఎయిర్టెల్ తమ శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణలో ఇరు సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఇక్కడ మొదలైన ఐఎంసీలో అటు రిలయన్స్ జియో తమ జియోస్పేస్‌ఫైబర్, ఇటు భారతీ ఎయిర్టెల్ తమ వన్‌వెబ్ విశేషాలు, సన్నద్ధతల్ని తెలియపర్చాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేని దేశంలోని మారుమూల ప్రాంతాలకూ హై-స్పీడ్ బ్రాడ్‌బాండ్ సర్వీసులను సరసమైన ధరలకే అందించేందుకు జియోస్పేస్‌ఫైబర్‌ను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చామని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.
తమ టెక్నాలజీతో భారత్.. ప్రపంచ బ్రాడ్‌బాండ్ రాజధానిగా అవతరిస్తుందన్న విశ్వాసాన్ని కనబర్చారు. ప్రస్తుతం హై-స్పీడ్ బ్రాడ్‌బాండ్ ఫిక్స్డ్ లైన్, వైర్లెస్ సర్వీసులను 45 కోట్ల భారతీయ వినియోగదారులకు జియో అందిస్తున్నదన్నారు. ఇక వచ్చే నెల నుంచి దేశంలోని అన్ని చోట్లా వన్‌వెబ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. దేశంలో గత ఏడాది 5జీ సర్వీసులను ప్రారంభించామని, ఇప్పటిదాకా 5వేల నగరాలు, పట్టణాలతోపాటు 20వేల గ్రామాలకు విస్తరించామని చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ను అందించేందుకే వన్వెబ్ను తెచ్చామని వివరించారు.
దేశంలో 4జీ నెట్వర్క్ బలోపేతానికి, 5జీ సేవల విస్తరణకు భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్టు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. భారత్.. ఓ టెలికం టెక్నాలజీ డెవలపర్‌గా ఎదుగుతున్నదని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. డిజిటలైజేషన్‌కు ముఖద్వారం టెలికం రంగమేనన్నారు. 5జీ సేవల విస్తరణ వేగంగా జరుగుతున్నదని, ఇక భారత్.. 6జీ దిశగా అడుగులేస్తోందని చెప్పారు.