న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. గృహ, ఆటో, ఇతర రుణ రేట్ల పెంపునకు కారణమయ్యే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంఎసీఎల్ఆర్)ను పెంచుతున్నట్టు బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) చొప్పున అధికంచేసింది. అన్ని కాలపరిమితుల ఎంసీఎల్ఆర్కు ఈ పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. ఏప్రిల్ 15 నుంచి ఈ పెంపుదల అమలులోకి వచ్చింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 6.65 శాతం నుంచి 6.75 శాతానికి పెరగ్గా, మూడేండ్ల ఎంసీఎల్ఆర్ 7.30 శాతం నుంచి 7.40 శాతానికి చేరింది. రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా అట్టిపెట్టిన కొద్ది రోజులకే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ పెరగడం గమనార్హం.z
ఎంసీఎల్ఆర్ అంటే..
ఎంసీఎల్ఆర్ లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అనేది ఆయా బ్యాంక్‌ల బెంచ్‌మార్క్ వడ్డీ రేటు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అంతకంటే తక్కువ రేటుపై రుణాల్ని కస్టమర్లకు ఇవ్వరాదు. అలాగే ఏ రుణాలకైనా అదే కనిష్ఠ వడ్డీ రేటుగా ఉంటుంది. ఎంసీఎల్ఆర్ మారినపుడల్లా ఆయా బ్యాంక్‌ల ప్రస్తుత రుణగ్రహీతలు, కొత్తగా రుణాలు తీసుకునేవారికి వడ్డీ రేట్లు మారతాయి.