న్యూఢిల్లీ, నవంబర్ 11 : రిటైర్మెంట్తో కెరియర్ ముగిసినట్టేనని అనుకోవద్దంటూ సేల్స్‌ఫోర్స్ దక్షిణాసియా అధిపతి అరుంధతి భట్టాచార్య అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తొలి మహిళా చీఫ్‌గా పనిచేసిన భట్టాచార్య.. ఆ పదవీ విరమణ తర్వాత కొత్త కెరియర్ను ఎంచుకొన్నానని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన భట్టాచార్య విలేకరులతో మాట్లాడుతూ.. బలమైన సంకల్పంతో కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న ఇబ్బందికర పరిణామాలను చూసి భయాందోళనలకు గురికావద్దన్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను ఉదాహరించారు.
‘58 ఏండ్లు వచ్చాక మా నాన్న ఇంకేమీ చేయడానికి లేదని నిర్ణయించుకొని రిటైరైపోయారు. అయితే ఇప్పుడలా కాదు. అవకాశాలున్నాయి. అందుకే నేను ఆ వయసు దాటాక వాటిని అందిపుచ్చుకొని నూతన కెరియర్ను ప్రారంభించాను. నేడు నా వయసు 69 ఏండ్లు. ఇప్పటికీ నా కెరియర్లో నేను ఉన్నతంగా ఉన్నాను’ అని భట్టాచార్య తెలిపారు. 2013లో ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన భట్టాచార్య.. 2017లో రిటైరైయ్యారు. ఈ క్రమంలోనే 2020లో క్లౌడ్ ఆధారిత సేవల ప్రొవైడర్ సేల్స్‌ఫోర్స్ ఇండియాలో చైర్పర్సన్, సీఈవోగా చేరారు. ప్రస్తుతం భట్టాచార్య సేల్స్‌ఫోర్స్ దక్షిణాసియా అధ్యక్షురాలు, సీఈవోగా ఉన్నారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఆమె అందించిన సేవలకుగాను ఈ ఏడాది జనవరిలో పద్మశ్రీ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే.
మారుతున్న టెక్నాలజీ, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ తొలగింపులు సర్వసాధారణమేనని భట్టాచార్య అన్నారు. అయితే కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే అవకాశాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయని తెలిపారు.