న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కృత్రిమ మేధస్సు (ఏఐ)లో సరికొత్త సంచలనం, అమెరికాకు చెందిన కంపెనీ ఆంథ్రోపిక్‌తో.. భారతీయ ఐటీ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ జట్టు కట్టింది. టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి తదితర కంపెనీల కోసం అత్యాధునిక సంస్థాగత ఏఐ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తేవడం, అభివృద్ధిపర్చడానికి ఆంథ్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మంగళవారం ఇన్ఫోసిస్ ప్రకటించింది.
ముందుగా టెలికాం రం గంలో ఆంథ్రోపిక్ సహకారాన్ని ఇన్ఫోసిస్ తీసుకోనున్నది. ఈ మేరకు ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొన్నది. ‘ఓ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీలో పనిచేసే ఏఐకి, డెమోలో ఉన్న ఏఐ మాడల్‌కు మధ్య చాలా అంతరం ఉన్నది. ఈ దూరాన్ని తొలగించడానికి ఆయా రంగాల్లో సమర్థవంతమైన నైపుణ్యం అవసరం. ఇన్ఫోసిస్‌కు టెలికాం, ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో అలాంటి నైపుణ్యమే ఉన్నది’ అని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ అన్నారు.