Trump Tariffs | వాషింగ్టన్, ఏప్రిల్ 10: టారిఫ్‌లపై ట్రంప్ వెనుకడుగు వేయడానికి బాండ్ మార్కెట్లే కారణమా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అమెరికా ట్రెజరీ బాండ్లకు డిమాండ్ తగ్గి ఇన్వెస్టర్లు వాటిని కొనడానికి బదులుగా అమ్మకాలకు దిగుతుండటాన్ని గమనించా మని ట్రంప్ చెప్పారు. వ్యాపారులు, పార్టీ నేతలు తాత్కాలికంగా టారిఫ్‌లను వాయిదా వేయాలని కోరినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టారిఫ్‌ల వాయిదా. కాగా, టారిఫ్‌ల వాయిదాతో బుధవారం అమెరికా ప్రభుత్వ బాండ్ల రేట్లు 3.9 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగాయి. బాండ్లకు డిమాండ్ తగ్గితే అమెరికాకు నిధుల సమీకరణ కష్టతరమవుతుంది. ప్రభుత్వ ఖర్చుల నిర్వహణకూ ఇబ్బందే. ఇది చివరకు మాంద్యానికి దారితీయవచ్చు.
ప్రతీకార సుంకాల నుంచి చైనాకు మినహాయింపునివ్వకపోవడంతో అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదలైనైట్టెంది. చైనాపై అమెరికా టారిఫ్‌లు 145 శాతానికి పెరిగితే.. అమెరికాపైనా చైనా దీటుగానే స్పందిస్తు న్నది. అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నది. అధిక సుంకాల ముప్పు ఉన్న యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సంప్రదింపులు చేస్తున్నది. అలాగే ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతోనూ చర్చలకు సిద్ధమవుతున్నది. అయితే చైనాతో సత్సంబంధాలు లేకపోవడంతో భారత్, ఆస్ట్రేలియాలు ఈ అంశంపై దూరంగా ఉంటున్నాయి. టారిఫ్‌ల ప్రభావం లేని రష్యా, మరికొన్ని దేశాలూ ఇంతే. దీంతో చైనా ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.
అమెరికా-చైనా ట్రేడ్‌వార్ నేపథ్యంలో చిన్న వ్యాపారులకు పెద్ద దెబ్బే తగులుతున్నది. ముఖ్యంగా అమెరికాలో చిరు వ్యాపారులపై ఈ ప్రభావం భారీగానే ఉండనున్నది. మునుపు చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తూత్పత్తులకు 26,000 డాలర్లు చెల్లిస్తే.. ఇప్పుడు వాటికే 3.5 లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తున్నది మరి. ఈ నేపథ్యంలోనే తన కంపెనీ మూతబడే పరిస్థితి వచ్చిందని, నిలువ నీడకూడా లేకుండాపోయేలా ఉందని ఓ అమెరికన్ వ్యాపారి కన్నీటి పర్యంతమయ్యారు.