న్యూఢిల్లీ, మే 1 : జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే 12.6 శాతం అధికమని పేర్కొంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన జూలై 1, 2017 తర్వాత ఇదే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. ఈ ఏడాది మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు వసూలయ్యాయి. గడిచిన నెలలో వసూలైనదాంట్లో దేశీయంగా రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి.
గతేడాదితో పోలిస్తే 10.7 శాతం మేర పెరిగాయి. వీటిలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.48,634 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.59,372 కోట్లు, ఇంటిగ్రడ్ జీఎస్టీ కింద రూ.69,504 కోట్లు, సెస్ రూపంలో రూ.12,293 కోట్లు వసూలయ్యాయి. దేశ ఆర్థిక రంగం బలంగా ఉందన్నడానికి ఈ జీఎస్టీ వసూళ్లే నిదర్శనమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయి దాటిందని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మణి తెలిపారు. అత్యధిక ఉత్పత్తి, వినిమయ రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి 11 శాతం నుంచి 16 శాతం మధ్యలో నమోదవడం వల్లనే రికార్డు స్థాయికి చేరుకున్నాయన్నారు.