Tim Cook | న్యూఢిల్లీ, మే 2 : అమెరికాలో అమ్ముడుకానున్న ఐఫోన్లలో భారత్‌లో తయారైనవే అత్యధికంగా ఉండనున్నాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. వరుసగా ఏడో త్రైమాసికంలోనూ చైనాలో ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో సంస్థ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఒకవైపు ప్రతీకార సుంకాలు విధిస్తుండటంతో భారత్‌లో తయారవుతున్న ఐఫోన్లను భారీగా దిగుమతి చేసుకోవాలని చూస్తున్నది సంస్థ. జూన్ త్రైమాసికం నాటికి యూఎస్‌లో అమ్ముడుకానున్న అత్యధిక ఐఫోన్లలో భారత్ నుంచి దిగుమతి చేసుకునేవే ఉండనున్నాయని, అలాగే వియత్నాం నుంచి ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచెస్, ఎయిర్‌ప్యాడ్స్ ఉండనున్నాయని చెప్పారు.
2024లో అమెరికాలో 75.9 మిలియన్ల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్కు భారత్ నుంచి అత్యధికంగా ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయని, ఫిబ్రవరితో ముగిసిన మూడు నెలలకాలంలో ఎగుమతులు 82 శాతం పెరిగాయని, ఇదే క్రమంలో మార్చి నాటికి 97.6 శాతానికి చేరుకున్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. మార్చితో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 90.75 బలియన్ డాలర్ల నుంచి 95.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.