Apple – iPhone 16 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. భారత్‌లో మేడిన్ ఇండియా ఇన్షియేటివ్‌లో తన ఐ-ఫోన్ల ఉత్పత్తి పెంచనున్నది. గత నెలలో మార్కెట్లో విడుదలైన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లన్నీ భారత్ లోనే తయారు చేస్తామని శుక్రవారం తెలిపింది. ఐ-ఫోన్లకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో దేశంలో మరో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైల్లో కొత్త రిటైల్ స్టోర్లు తెరవనున్నది. గతేడాది ఏప్రిల్ లో ఢిల్లీలోని సాకేత్, ముంబైలోని బీకేసీ కాంప్లెక్సులో ఆపిల్ ఐ-ఫోన్ల విక్రయ కేంద్రాలు తెరిచిన సంగతి తెలిసిందే. అయితే మరో నాలుగు కొత్త స్టోర్లను ఎప్పుడు తెరుస్తారన్న సంగతిని మాత్రం ఆపిల్ ధృవీకరించలేదు. ఇక భారత్ నుంచే విదేశాలకు 25 శాతం స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయాలని ఆపిల్ భావిస్తోంది.
2017 నుంచి భారత్‌లో ఆపిల్ తన ఐ-ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నది. ప్రారంభంలో పాత మోడల్ ఫోన్లు పరిమిత స్థాయిలో తయారు చేసింది. 2021లో ఆవిష్కరించిన కొన్ని నెలల తర్వాత ఐ-ఫోన్ 13 మోడల్ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లకు రీచ్ అయ్యాయి. 2022లో రెండు వారాల్లోపు విదేశీ మార్కెట్లకు ఐ-ఫోన్14 ఫోన్లు చేరాయి. 2023లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించిన తొలి రోజు నుంచి అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో బేస్ ఐ-ఫోన్ల ఉత్పత్తికే పరిమితమైంది.
ఇప్పుడు మొత్తం ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల ఉత్పత్తి చేపట్టనున్నది. అందులో ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ ప్రో మ్యాక్స్ ఫోన్లు కూడా ఉంటాయి. భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించిన తొలి రోజే ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్ లో ఆపిల్ లో 3000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. కొత్తగా మరో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో కొత్తగా కొలువులు రానున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో 15 అంతస్తుల భవనంలో కొత్త ఆఫీసు ప్రారంభించింది. ఈ ఆఫీసులో 1200 మంది ఉద్యోగులు పని చేస్తారు. ఈ ఆఫీసు ల్యాబ్ స్పేస్ కోసం డెడికేట్ చేస్తున్నట్లు ఆపిల్ తెలిపింది.