హైదరాబాద్, జూన్ 22: ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా..హైదరాబాద్‌లో మరో ఆఫీస్‌ను లీజుకు తీసుకున్నది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్థలాన్ని పదేండ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం నెలకు రూ.3 కోట్లు అద్దె రూపంలో చెల్లించనున్నది. 400 మందికి పైగా కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ ఆఫీస్ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నది.
దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నదని, దీంతో ఇక్కడ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను నెలకొల్పడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఇక్కడ జీసీసీలను నెలకొల్పాయి. వీటిలో ఉబర్ 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీని నెలకొల్పగా, టీసీఎస్ 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, మైక్రోసాఫ్ట్ ఇండియా 2.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్పొరేట్ ఆఫీస్‌ను ప్రారంభించాయి.