PM Modi | న్యూఢిల్లీ, జూన్ 19: గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జాతీయ నగదీకరణ కార్యక్రమం (ఎన్ఎంపీ) కింద కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రూ.1.56 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది. నిజానికి రూ.1.80 లక్షల కోట్ల ఆస్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. బుధవారం వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం 2021-22 నుంచి 2024-25 వరకు మొత్తం నాలుగేండ్లలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మౌలిక రంగ ఆస్తులను అమ్మి రూ.6 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని బీజేపీ సర్కారు నిర్దేశించుకున్నది. ఈ క్రమంలోనే 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 2.30 లక్షల కోట్ల ఆస్తులను అమ్మేసింది.
వచ్చే మార్చికల్లా..
2023-24తో కలిపితే మూడేండ్లలో రూ.4 లక్షల కోట్ల ఆస్తులను విక్రయించినట్టవగా, తొలి రెండేండ్లతో పోల్చితే తర్వాతి సంవత్సరంలోనే అత్యధికంగా అమ్మేయడం గమనించదగ్గ అంశం. ఇక లక్ష్యాన్ని చేరుకోవాలంటే వచ్చే మార్చి నాటికి ఇంకా రూ.2 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మాల్సి ఉన్నది. దీంతో త్వరలోనే మరింత సర్కారీ సంపద.. ప్రైవేట్‌పరం కాబోతున్నది. ఇప్పటికే ఎన్హెచ్ఏఐ 33 ఆస్తులను కూడా గుర్తించింది. కాగా, రోడ్డు రవాణా-జాతీయ రహదారులు, బొగ్గు, విద్యుత్తు, గనులు, పెట్రోలియం-సహజ వాయువు, పట్టణాభివృద్ధి, షిప్పింగ్ తదితర మంత్రిత్వ శాఖల్లో ఆస్తుల అమ్మకాలకు సంబంధించి పెట్టుకున్న లక్ష్యంలో 70 శాతం పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
వాటాల విక్రయం, డివిడెండ్లతో..
అందినకాడికి అమ్ముకుంటూపోతున్న మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో వాటాల విక్రయం ద్వారా, ఆయా కంపెనీలిచ్చే డివిడెండ్లతో కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే చాలా సంస్థల్లో వాటాలను తగ్గించుకున్న కేంద్రం.. ఎయిర్ ఇండియా వంటి సంస్థలను అడ్డగోలుగా మొత్తం విక్రయించిన సంగతి విదితమే. ఇక ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచే గత పదేండ్ల హయాంలో దాదాపు రూ.9 లక్షల కోట్లను డివిడెండ్‌గా అందుకున్నది. గత ఆర్థిక సంవత్సరానికైతే రికార్డు స్థాయిలో ఆర్బీఐ రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ప్రకటించినది తెలిసిందే. మిగతా ప్రభుత్వ సంస్థల నుంచీ పెద్ద ఎత్తునే డివిడెండ్ ఆదాయం వస్తున్నది. అయినప్పటికీ కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించకుండా ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలకే కేంద్రం ఆసక్తి చూపుతుండటం ఇప్పుడు సర్వత్రా విమర్శలపాలవుతున్నది.
గత ఆర్థిక సంవత్సరం కేంద్రం అమ్మేసిన ప్రభుత్వ ఆస్తులు
