న్యూఢిల్లీ, జూలై 15: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి. ఈ దశాబ్దానికిపైగా కాలంలో దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏకంగా 274 శాతం పెరిగిపోయాయంటే పన్నుల భారం ఏ స్థాయిలో ఎక్కువైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ సర్కారు హయాంలో చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14లో రూ.7.22 లక్షల కోట్లుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లుంటే.. గత ఆర్థిక సంవత్సరం (2024-25) రూ.27.03 లక్షల కోట్లుగా ఉన్నాయి.
కొత్త ఆదాయ పన్ను విధానంతో పన్ను మినహాయింపులు, కోతలకు తావు లేకుండా చేశారని కేంద్ర ప్రభుత్వంపై పలువురు ఆర్థిక నిపుణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత పన్ను విధానంలో సేవింగ్స్‌కు, పెట్టుబడులకు ప్రాధాన్యత ఉండేదని, దీంతో దేశం పొదుపు దిశగా నిర్మాణాత్మకంగా అడుగులేసిందని పేర్కొంటున్నారు. అయితే ప్రతీ బడ్జెట్లో పాత పన్ను విధానానికి స్వస్తి పలికేలా.. కొత్త పన్ను విధానంలోనే మార్పులు చేస్తున్నారని, ఇది సరికాదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఖజానాను నింపుకోవడానికి ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం తగదని చెప్తున్నారు. నిజానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు కూడా ఏటేటా పెరుగుతూపోతున్న సంగతి విదితమే. దీంతో అటు ప్రత్యక్ష, ఇటు పరోక్ష పన్నుల్ని ప్రజానీకం నుంచి సర్కారు పిండుకుంటున్నట్టవుతున్నది.
ఈ 11 ఏండ్లలో రిఫండ్స్ కూడా 474 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చెప్తున్నది. 2013-14లో రూ.83,008 కోట్లుగా ఉన్న రిఫండ్స్.. 2024-25లో రూ.4,76,743 కోట్లుగా ఉన్నట్టు తేలింది. 2014 నుంచి ఇప్పటిదాకా చూసినైట్టెతే ఐటీ రిటర్న్స్ దాఖలుచేసేవారు 133 శాతం పెరిగారు. 2024-25లో 8.89 కోట్లకుపైగా ట్యాక్స్‌పేయర్స్ ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నులను దాఖలు చేశారు. 2013-14లో 3.8 కోట్లుగానే ఉన్నారు. కాగా, గత 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూలై 10 వరకు రిఫండ్స్ అనంతరం నికర ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.73,893 కోట్లుగా ఉన్నది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి జూలై 10దాకా రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈసారి రూ.6.65 లక్షల కోట్లుగా, పోయినసారి రూ.6.44 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రిందటితో పోల్చితే 3.17 శాతం పెరిగాయి.