న్యూఢిల్లీ, మార్చి 19 : రాత్రివేళ కూడా మీకు సూర్యుని వెలుగు కావాలా? మేమందిస్తామంటూ ముందుకొచ్చింది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే స్టార్టప్ సంస్థ. సూర్యాస్తమయం తరువాత కూడా అంతరిక్షంలో ఉపగ్రహాలు, భారీ అద్దాలు (రిఫ్లెక్టర్ల) సాయంతో మీకు భానుడి వెలుగును అందిస్తామని ఈ సంస్థ పేర్కొంటున్నది. భూమికి 600-625 కిలోమీటర్ల ఎత్తులో సూర్యుని సమకాలిక కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ద్వారా రాత్రివేళ కూడా సూర్యుని వెలుగును భూమిపై ప్రసరింపజేయవచ్చని చెప్తున్నది. ఈ ఉపగ్రహాలు నిత్యం సూర్యుని వెలుగులోనే ఉంటూ అదే సమకాలిక కక్ష్యలో ప్రయాణిస్తుంటాయి. ఈ ఉపగ్రహాలకు ఎదురుగా 10 నుంచి 54 మీటర్ల వెడల్పున ఉండే భారీ అద్దాలను అమర్చుతారు. ఈ అద్దాలు సూర్యుని వెలుగును భూమి వైపు మళ్లిస్తాయి. ఈ వెలుగు కావాలనుకున్న వారు ఒక యాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తే.. తాము కోరుకున్న ప్రదేశంలో సూర్యుని వెలుగు పడుతుంది.
అయితే ఈ వెలుగు సాధారణంగా పగటి వేళ ఉండేంత తీవ్రంగా ఉండదు. కానీ పౌర్ణమి రోజున ఉండే చంద్రుని వెలుగుకంటే నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. ఇక ఈ వెలుగు కేవలం ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే విస్తరిస్తుంది. ఈ వెలుగుకు అయ్యే ఖర్చు గంటకు రూ.45 లక్షలు అని స్టార్టప్ నిర్వాహకులు తెలిపారు. వెయ్యి ఎకరాల్లో నిర్మించే సౌర క్షేత్రానికయ్యే ఖర్చు కంటే ఇది చాలా తక్కువ అని అన్నారు. ఉపగ్రహాల సాయంతో వచ్చే వెలుగుతో సౌరక్షేత్రాల నుంచి రాత్రివేళ కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. రాత్రివేళ సహాయ కార్యక్రమాలకు, సైనిక అవసరాలకు కూడా ఈ వెలుగును ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతానికి తాము 2035 నాటికి 50 వేల ఉపగ్రహాలతో ఒక నెట్వర్క్ను ఏర్పాటుచేసేందుకు గాను నిధులను సమీకరించే పనిలో ఉన్నామని చెప్పారు.