Tomato | రోజువారీగా కూరల్లో వాడే టమాట.. ఇప్పుడు రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో టమాట తోటలు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. ఫలితంగా మార్కెట్లో టమాటాలకు గిరాకీ పెరగడంతోపాటు ధర కూడా ఝూమ్మంటూ పైపైకి దూసుకెళ్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాట రైతులకు జాక్ పాట్ తగిలినట్లయింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళి (48) అనే రైతు గత 45 రోజుల్లో రూ.4 కోట్ల ఆదాయం సంపాదించాడు. మురళి తండ్రి కూడా రైతే. వీరు టమాటల సాగుతో రూ.50 వేలకు ఓ ఇల్లు కొనుక్కున్నారు. మరికొంత మొత్తం దేవుడి హుండీలో వేశారు.
టమాటల సాగుతో మురళి విజయం సాధించడానికి ఎన్నో కష్టాలు.. నష్టాలతో సవాసం చేశాడు. గరిష్ట దిగుబడి వచ్చేసరికి మార్కెట్లో టమాటలకు ధర లేక గతేడాది ఆయన కుటుంబానికి రూ.1.5 కోట్ల అప్పు మిగిలింది. కానీ, సకాలంలో విద్యుత్ సరఫరా కావడం, నాణ్యతతో కూడిన పంట దిగుబడి, సరసమైన ధర పలకడంతో మురళి కుటుంబం రూపురేఖలే మారిపోయాయి.
ఇంతకుముందు ఏపీఎంసీ మార్కెట్ యార్డులో కంటే మెరుగైన ధరకు విక్రయించడం కోసం 130 కి.మీ. దూరంలోని కొలార్కెళ్లి, టమాటలు విక్రయించేవాడు. ఈ ఏడాది చాలా కష్టపడి ప్రణాళికాబద్ధంగా పంట సాగు చేయడంతో గతేడాది అప్పు తీర్చడంతోపాటు కేవలం 45 రోజుల్లో రూ.2 కోట్ల ఆదాయం సంపాదించడంతో అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మురళి. ఈ ఏడాది అధునాతన టెక్నాలజీ, హార్టికల్చర్ పద్దతులతో భారీ మొత్తంలో పంట సాగు చేయాలని సంకల్పించాడు. అందుకోసం అదనంగా 20 ఎకరాల భూమి కొనుగోలు చేయాలని భావిస్తున్నాడు.