Anant-Radhika : అనంత్-రాధికా మర్చంట్ల వివాహ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల నడుమ అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వివాహరం సందర్భంగా రియల్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ.. తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, వివిధ రంగాలకు చెందని అతిథులతో కలిసి డ్యాన్స్ చేశారు.
శుక్రవారం వివాహ మహోత్సవం పూర్తికావడంతో ఇవాళ ‘శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్’ పేరుతో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. కల్యాణ మహోత్సవం జరిగిన ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్’లోనే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరుగుతోంది. ఈ రిసెప్షన్‌కు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబసమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు.
అదేవిధంగా తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటుడు వెంకటేశ్ తన సతీమణితో కలిసి రిసెప్షన్‌కు హాజరయ్యారు. వెంకటేశ్‌తోపాటు క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కూడా తమ సతీమణులతో కలిసి రిసెప్షన్‌కు విచ్చేశారు. అదేవిధంగా శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే కూడా తన సతీమణితో కలిసి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చారు.