న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: రాబోయే ద్రవ్య సమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెంచాల్సిందేనని శుక్రవారం బయటికొచ్చిన ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక ఒకటి అభిప్రాయపడింది. వచ్చే నెల ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరుగనున్న క్రమంలో ఇదిప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. రెపోరేటును అక్టోబర్లో 25 బేసిస్ పాయింట్లు, డిసెంబర్లో మరో 25 బేసిస్ పాయింట్లు పెంచాలని, అప్పుడే అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించగలమని సదరు రిపోర్టులో ఎస్బీఐ రిసెర్చ్ పేర్కొన్నది.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న వేళ.. పెరుగుతున్న క్రూడాయిల్ రేట్లు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను పెంచుతున్నాయని ఎస్బీఐ రిసెర్చ్ అంటున్నది. దీంతో ద్రవ్యోల్బణం కట్టడికి వచ్చే రెండు ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును 50 బేసిస్ పాయిం ట్లు పెంచాల్సిన అవసరం ఉన్నదన్నది. కాగా, అక్టోబర్ 5-7 తేదీల్లోనే ఆర్బీఐ ద్రవ్య సమీక్ష. ఆగస్టు ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచిన సంగతి విదితమే.