Amul Milk Costly | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ లీటర్ పాల ధర రూ.2 పెరిగింది. ఇప్పటి వరకు లీటర్ అమూల్ ఫుల్ క్రీమ్ మిల్క్ (అమూల్ గోల్డ్) రూ.61 పలికితే, ఇక నుంచి రూ.63 చెల్లించాల్సి ఉంటుంది. అర్థ లీటర్ పాల ధర రూ.30 నుంచి రూ.31కి పెరిగింది. అమూల్ పాల ధర పెంచడం ఈ ఏడాదిలో మూడో సారి. గత మార్చి, ఆగస్టు నెలల్లో రూ.2 చొప్పున పెంచేసింది. అయితే.. గుజరాత్లో మాత్రం పెంచిన ధరలు అమల్లోకి రావు. పాత ధరకే గుజరాత్లో అమూల్ పాలు లభిస్తాయి. దీనికి కారణం ఉంది.. గుజరాత్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి త్వరలో కేంద్రం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నది.
ఈ దఫా పాల ధర పెంచడానికి గల కారణాలేమిటో అమూల్ వెల్లడించలేదు. ఇంతకుముందు ఆగస్టులో ధరలు పెంచినప్పుడు మాత్రం పాల ఉత్పత్తి ఖర్చు, ఆపరేషన్ లావాదేవీలు పెరిగిపోవడం వల్లే పాల ధర పెంచాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఆవులు, గేదెలకు వేసే పశుగ్రాసం ధర సుమారు 20 శాతం పెరిగిందని ప్రకటించింది. పశుగ్రాసంతోపాటు ఇన్పుట్ వ్యయం పెరిగిపోయినందున గతేడాదితో పోలిస్తే రైతుల నుంచి పాల సేకరణ ధరను 8-9 శాతం పెంచామని అమూల్ ఫెడరేషన్ అనుబంధ మిల్క్ యూనియన్లు వెల్లడించాయి.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో మదర్ డెయిరీ లీడింగ్ మిల్క్ సప్లయర్. పాలీ ప్యాక్స్, వెండింగ్ మిషన్ల ద్వారా రోజూ 30 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తున్నది. అమూల్ దేశంలోనే లీడింగ్ మిల్క్ సప్లయర్. అమూల్ యజమానులు కూడా లక్షల మంది రైతులే. 75 ఏండ్ల క్రితం రెండు గ్రామాల నుంచి 247 లీటర్ల పాలను సేకరించడంతో మొదలైన అమూల్ ప్రయాణం ఇప్పుడు 260 లక్షల లీటర్లకు దూసుకెళ్లింది.