న్యూఢిల్లీ : భారత్లో వచ్చే ఐదేండ్లలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెరికన్ సెమికండక్టర్ దిగ్గజం అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (AMD) శుక్రవారం వెల్లడించింది. గాంధీనగర్లో జరుగుతున్న సెమికాన్ ఇండియా సదస్సు 2023లో ఏఎండీ ఈ విషయం వెల్లడించింది. 2028 నాటికి భారత్లో అదనంగా 3000 మంది టెకీలకు ఉద్యోగాలను జోడించనుంది.
2023 సంవత్సరాంతానికి న్యూ ఏఎండీ క్యాంపస్ ప్రారంభమవుతుందని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పెపర్మాస్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, గురుగ్రాం, ముంబైల నుంచి ఏఎండీ కార్యకలాపాలు సాగుతున్నాయి. భారత్లో ఢిల్లీలో తొలి కార్యాలయం ప్రారంభించడం ద్వారా 2001లో ఏఎండీ కార్యకలాపాలు మొదలవగా ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6500కు పెరిగింది.
నైపుణ్యాలతో కూడిన సిబ్బంది, స్ధానిక మేనేజ్మెంట్ బృందం కృషితో భారత్లో ఏఎండీ విస్తరణకు బాటలు వేసిందని మార్క్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన సెమికాన్ ఇండియా సదస్సులో గుజరాత్ సీఎం, ఉన్నతాధికారులతో పాటు మైక్రాన్ టెక్నాలజీ, అప్లైడ్ మెటీరియల్స్, ఫాక్స్కాన్, సెమీ, ఏఎండీ సహా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొన్నాయి.
Read More :