Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఆర్థిక మాంద్యం భయాలతో విడతల వారీగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోమారు లేఆఫ్స్ కు తెరలేపింది. ఫార్మసీ (Pharmacy division) యూనిట్ లో కొందరి ఉద్యోగులపై వేటు వేసింది.
తాజా రౌండ్ లేఆఫ్ లో 80 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ప్రధానంగా ఫార్మసీ టెక్నీషియన్స్, టీమ్ లీడ్స్ ఉన్నారు. అయితే, రిజిస్టర్ అయిన ఫార్మసిస్ట్ లను కంపెనీ తొలగించలేదని సమాచారం. తాజా లేఆఫ్స్ పై సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘క్వాలిటీ, సామర్థ్యం కోసం మా ప్రాసెస్ ను నిరంతరం మెరుగుపర్చుకుంటాం. తద్వారా బెస్ట్ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ కోసం కృషి చేస్తాం. తాజాగా అమెజాన్ ఫార్మసీ విభాగంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాం. వనరులను సర్దుబాటు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.
కాగా, అమెజాన్ ఈ ఏడాది ప్రారంభంలో 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అనంతరం మార్చిలో సీఈవో అండీ జస్సీ 9000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 18న అడ్వర్టైజింగ్ యూనిట్‌కు చెందిన పలువురు ఉద్యోగులను అమెజాన్ సాగనంపింది.ఈ ఏడాది మేలో మరో 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. ఈ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), హ్యూమన్ రిసోర్స్ అండ్ సపోర్ట్ ఫంక్షన్స్ విభాగంలోని ఉద్యోగులపై పడింది. తాజాగా ఫార్మసీ డివిజన్‌లోనూ లేఆఫ్స్ ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
Also Read..
America | చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి..!
Mother | కొడుకు కాలేజీ ఫీజు కోసం.. తల్లి ప్రాణ త్యాగం.. వీడియో వైరల్
IKEA India | యువతికి భయంకరమైన అనుభవం.. ఐకియా స్టోర్ లో డిజర్ట్ తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక