బుధవారం 03 జూన్ 2020
Business - Mar 30, 2020 , 00:01:53

ఇంధన కొరత లేదు

ఇంధన కొరత లేదు

-అన్ని ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి 

-వినియోగదారులు ఆందోళనచెందనక్కర్లేదు: ఐఓసీ

న్యూఢిల్లీ, మార్చి 29:దేశంలో ఇంధన కొరత లేదని ప్రభుత్వరంగ చము రు సంస్థ ఐఓసీ ప్రకటించింది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ (ఎల్పీజీ) సరఫరాల విషయమై వినియోగదారులెవరూ ఆందోళనచెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఐఓసీ ఈ ప్రకటన చేసింది. దేశంలో మరో మూడు వారాలకుపైగా సరిపడా ఇంధన నిల్వలున్నాయని, దేశవ్యాప్తంగా అన్ని ఇంధన ప్లాంట్లు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. 

పితృవియోగ దుఖాఃన్ని దిగమింగుకొని..

కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నాడే (మార్చి 24న) సంజీవ్‌ సింగ్‌ పితృవియోగంతో విషాదంలో మునిగిపోయారు. అయినప్పటికీ ఆ దుఖాఃన్ని మరుక్షణమే దిగమింగుకొని 24 గంటలు తిరక్కుడానే విధుల్లో చేరిన సంజీవ్‌ సింగ్‌.. దేశంలోని ప్రతి మూలకూ నిరంతరాయంగా ఇంధ న సరఫరాలు జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. 

సౌదీ మంత్రితో ప్రధాన్‌ చర్చలు

ప్రస్తుతం అంతర్జాతీయ చమురు మార్కెట్లలో చోటుచేసుకొంటున్న పరిణామాలు, ఎల్పీజీ సరఫరాల విషయమై చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదివారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సౌదీ అరేబియా చమురుశాఖ మంత్రి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చలు జరిపారు. భారత్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాలు జరిగేలా చూడాలని ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీనికి అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సల్మాన్‌ సానుకూలంగా స్పందించారు.

ఎల్పీజీ పంపిణీ సిబ్బంది కోసం..

వైరస్‌ విజృంభించిన నేపథ్యంలో ఇం టింటికి గ్యాస్‌ సరఫరా చేస్తున్న సిబ్బంది కోసం ఐవోసీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ వైరస్‌ కారణంగా చనిపోతే వారి భార్యకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపింది. ఈ సమయంలో అందరూ విధి నిర్వహణలో ఉండాలని కోరింది. 


logo