హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): షుగర్ బాధితులు ఓఆర్ఎస్ఎల్ వాడొద్దని, ఇది ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరసం, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు చాలా మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన ఓఆర్ఎస్కు బదులుగా ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్‌ను తీసుకుంటున్నారని, ఇది ప్రమాదకరమని డాక్టర్ శివరంజిని సంతోష్ తెలిపారు.
షుగర్ బాధితులు ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడడంతో పాటు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఓఆర్ఎస్ఎల్ డ్రింక్స్‌లో చక్కెర స్థాయి అధికంగా ఉండడంతో కణాల్లో నుంచి నీరు రక్తనాళాల్లోకి చేరి, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుందని వివరించారు. దీంతో శరీరం మరింత డీహైడ్రేషన్‌కు గురవుతుందని తెలిపారు. ఇది షుగర్ బాధితులకు ప్రమాదకరమని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఓఆర్ఎస్ పౌడర్‌ను మాత్రమే వినియోగించాలని సూచించారు.