(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థికం కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నది. అమెరికా డాలర్ ముందు దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ దిగజారి పోతున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని కొత్త కనిష్ఠాలకు మన కరెన్సీ పతనమవుతున్నది.
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి దిగజారింది. ఒకానొక దశలో తొలిసారి 91.74కు పడిపోయింది. చివరకు 68 పైసలు నష్టపోయి 91.65 వద్ద స్థిరపడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనంతో ఖర్చులు పెరిగి, రుణాలు ఖరీదెక్కి, దిగుమతులు భారమై.. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొనే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2014లో ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 58.66గా ఉన్నది. ప్రస్తుతం ఇది రూ. 91.65కు పడిపోయింది. అంటే, గడిచిన పదకొండున్నర ఏండ్లలో రూ. 32.99 (57 శాతం) మేర పతనమయ్యింది. ఈ ఏడాదిలో అంటే గడిచిన 21 రోజుల్లో రూపాయి విలువ రూ. 1.77 మేర పతనమైందని, దీంతో ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీల్లో రెండోదిగా రూపాయి నిలిచిందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సుంకాల పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. యూరోపియన్ యూనియన్ దేశాలపై బెదిరింపులకు దిగడం, తమ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ట్రంప్ పెద్ద ఎత్తున సుంకాలు విధించడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ అనిశ్చితుల కారణంగా దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం తదితర కారణాలతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ అంతకంతకూ బలహీనపడుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రూపాయి విలువ అంతకంతకూ దిగజారితే అనేక సవాళ్లు ఎదురవుతాయని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొనే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. అలాగే దిగుమతయ్యే ప్రతీదాని ధర పెరుగుతూపోతుంది. చెల్లింపులు డాలర్లలో జరగడమే కారణమని అంటున్నారు. ముఖ్యంగా ముడిచమురు, మొబైల్స్, కంప్యూటర్లు వంటి దిగుమతి చేసుకొనే కన్జ్యూమర్ గూడ్స్ ధరలు పెరుగొచ్చని చెప్తున్నారు. అలాగే, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లి, తయారీ రంగం కుంటుబడుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా నిరుద్యోగం విజృంభించి చివరకు వృద్ధిరేటు క్షీణించే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో చదువుతున్న భారతీయుల ఖర్చులు అమాంతం పెరుగుతూపోతాయని విశ్లేషకులు అంటున్నారు.
రూపాయి విలువ క్షీణతతో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కరెన్సీ పతనంతో ఎఫ్ఐఐ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలనున్నాయన్నారు.
