హైదరాబాద్, జనవరి 17: మళ్లీ హైదరాబాద్‌లో విమానాల పండుగ రాబోతున్నది. ఈ నెల 28 నుంచి నాలుగు రోజుల పాటు 31 వరకు ‘వింగ్స్ ఇండియా 2026’ పేరుతో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించనున్నారు. ‘దేశీయ విమానయానం: భవిష్యత్తుకు బాటలు వేయడం..రూపకల్పన నుంచి అమలు వరకు, తయారీ నుంచి నిర్వహణ వరకు, సమ్మళితత్వం నుంచి ఆవిష్కరణ వరకు, భద్రత నుంచి సుస్థిరత వరకు’ అనే నినాదంతో జరిగే ఈ ఏవియేషన్ షోను పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజులపాటే జరిగే ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు విమానయాన రంగానికి చెందిన దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, విమాన తయారీ సంస్థలు హాజరుకానున్నాయి. దేశీయ విమానయాన రంగం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదని, భవిష్యత్తులో విమానాల తయారీ హబ్‌గా భారత్ మారుతున్నదని, అలాగే తయారీ, సేవలు, ఆవిష్కరణలు, సుస్థిర విమానయాన పరిష్కారాల కోసం కీలక కేంద్రంగా ఎదగడమే లక్ష్యంగా ఈసారి ఏవియేషన్ షో జరుగుతున్నదని నిర్వహకులు వెల్లడించారు.
ఈ ఎగ్జిబిషన్లో పలు విమానయాన సంస్థలు తమ విమానాలను డిస్ప్లే చేయడంతోపాటు ఫ్లైయింగ్, ఏరోబెటిక్ షోస్ కూడా జరగనున్నది. అలాగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లు, సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశాలు, బీ2బీ, బీ2జీ మీటింగ్‌లు, ఏవియేషన్ జాబ్ ఫెయిర్, అవార్డు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. 20 దేశాలకు చెందిన డెలిగేట్స్, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు.
వింగ్స్ ఇండియా-2026 కార్యక్రమ ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 85 లక్షల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించి ఆసియాలోనే అతిపెద్దదిగా చెప్పబడే ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత ఏవియేషన్ సంస్థలు పాల్గొనే అవకాశముంది. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పెట్టుబడుల ఆకర్షణతోపాటు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న మెరుగైన విధానాలను తెలుసుకునే వీలు కలుగుతుంది.