Air Passengers | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశీయ విమానప్రయాణికులు అంతకంతకు పెరుగుతున్నారు. జనవరి నెలలో దేశీయంగా 1.46 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన 1.31 కోట్లతో పోలిస్తే 11.28 శాతం అధికమయ్యారని తెలిపింది. సంస్థల వారీగా 65.2 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో తొలిస్థానంలో నిలిచింది. ఎయిర్ ఇండియా గ్రూపు మార్కెట్ వాటా 25.7 శాతానికి తగ్గింది. అలాగగే ఆకాశా ఎయిర్, స్పైస్జెట్ల మార్కెట్ వాటా వరుసగా 4.7 శాతం, 3.2 శాతానికి పెరిగాయి.
గత నెలలో విమానాల రద్దు 1.62 శాతంగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఫ్లై బిగ్ వాటా 17.74 శాతంగా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఫ్లై 91(5.09 శాతం) అలయెన్స్ ఎయిర్(4.35 శాతం) ఉన్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సరైన సమయానికి విమాన సర్వీసులు నడిపిన సంస్థల్లో 75.5 శాతంతో ఇండిగో తొలిస్థానంలో నిలువగా..ఆకాశ ఎయిర్ 71.5 శాతం, ఎయిర్ ఇండియా 69.8 శాతం, అలయెన్స్ ఎయిర్ 57.6 శాతం, స్పైస్‌జెట్ 54.8 శాతంతో ఉన్నాయి. గత నెలలో విమానాలు రద్దు కావడంతో 41 వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరికి విమానయాన సంస్థలు రూ.46.46 లక్షలు పరిహారం రూపంలో చెల్లించాయి.
ఆకాశ ఎయిర్ మరో ప్రాంతీయ రూట్లో నూతన విమాన సర్వీసును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నది. ఏప్రిల్ 4 నుంచి హైదరాబాద్ నుంచి బీహార్‌లోని దర్భంగా(వయా ఢిల్లీ) మధ్య సర్వీసును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య రోజువారి విమాన సర్వీసును నడుపుతున్నట్లు తెలిపింది.