Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) వచ్చారు. ప్రస్తుత సీఎఫ్ఓ వినోద్ హేజ్మాదీ రిటైర్మెంట్ అవుతున్న నేపథ్యంలో కొత్త సీఎఫ్ఓగా సంజయ్ శర్మ నియమితులయ్యారని ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. వినోద్ హెజ్మాదీకి టాటా సన్స్ సంస్థతో 30 ఏండ్లకుపైగా అనుబంధం ఉంది. టాటా సన్స్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా తన పూర్వ వైభవం కోసం పరుగులు తీస్తున్న తరుణంలో సంస్థ సీఎఫ్ఓగా సంజయ్ శర్మ నియమితులు కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
అదే సమయంలో టాటా సన్స్ ఆధీనంలోని నాలుగు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ కొనసాగుతున్నది. సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో జాయింట్ వెంచర్ విస్తారా ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం కోసం కసరత్తు కొనసాగుతున్నది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను టాటా సన్స్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.
కొత్తగా ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా నియమితులైన సంజయ్ శర్మ.. కంపెనీ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్ బెల్ విల్సన్ కు నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్మెంట్ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో సంజయ్ శర్మకు 30 ఏండ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఎఫ్ఓగా సంజయ్ శర్మ పని చేస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ కు ముందు టాటా రియాల్టీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఎఫ్ఓ కం మేనేజింగ్ డైరెక్టర్, డచెస్ బ్యాంక్ గ్రూప్ ఈక్విటీ క్యాపిటల్ హెడ్‌గానూ పని చేశారు. ముంబైలో డీఎస్పీ మెరైల్ లించ్ లిమిటెడ్, హంకాంగ్ లని మెరిల్ లైంచ్ ఆసియా పసిఫిక్ సంస్థల్లో పలు కీలక స్థానాల్లో పని చేశారు.