AI : 2022లో చాట్‌జీపీటీ లాంఛ్ అనంతరం ఇంటరాక్టివ్ ఏఐ చాట్‌బాట్స్‌పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగింది. చాట్‌జీపీటీకి విశేష ఆదరణ లభించడంతో ప్రమోటింగ్ కంపెనీ ఓపెన్ఏఐ, కంపెనీ సీఈవో సాం ఆల్ట్‌మాన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆపై చాట్‌జీపీటీ ప్రాచుర్యం పొందడంతో పలు టెక్ దిగ్గజ కంపెనీలు తమ సొంత చాట్బాట్లను లాంఛ్ చేశాయి. ఇక ఏఐతో నూతన అవకాశాలు ముందుకొస్తాయని, మానవులకు తమ దైనందిన జీవితంలో ఏఐ సాయపడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఏఐతో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని, మానవాళి విధ్వంసానికి ఇది దారితీస్తుందని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ గాడ్ఫాదర్లలో ఒకరిగా చెబుతున్న జెఫ్రీ హింటన్ గత ఏడాదిగా లేటెస్ట్ టెక్నాలజీ ప్రభావంపై హెచ్చరిస్తున్నారు. ఏఐతో పొంచిఉన్న ముప్పుపై హింటన్ ఇటీవల మరోసారి తన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని, దీనిపైనే తాను కలత చెందుతున్నానని ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే నూతన టెక్నాలజీ ఉత్పాదకతను పెంచి సంపదను సృష్టించినా అది తిరిగి సంపన్నుల చేతికి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐతో ప్రపంచానికి మేలు చేకూరి సంపదను సమకూర్చినా అది ఈ టెక్నాలజీతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, సామాన్యులకు చెందకుండా కేవలం డబ్బున వారి చేతుల్లోకే వెళుతుందని, ఇది సమాజానికి చేటు చేస్తుందని చెప్పారు. ప్రజలకు కనీస రాబడిని ప్రభుత్వం సమకూరిస్తే ఏఐ కారణంగా వారు ఇబ్బందులకు లోనుకాకుండా చూడవచ్చని హింటన్ సూచించారు. తనను సంప్రదించిన అధికారులు, పాలక వర్గాలకు తాను ప్రజలకు కనీస ఆదాయ పధకం గురించి ప్రతిపాదించానని, ఇది సరైన ఆలోచన అని వారికి చెప్పానని హింటన్ వివరించారు.
Read More :