న్యూఢిల్లీ, మే 16: భారతీయ వాణిజ్య ఎగుమతుల్లో వ్యవసాయం, ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తూత్పత్తుల వాటానే గత ఆర్థిక సంవత్సరం (2024-25) 50 శాతానికిపైగా ఉన్నట్టు తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో భారత్ నుంచి మొత్తం 437.42 బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ ఆయా దేశాలకు జరిగాయి. వీటిలో ఇంజినీరింగ్ గూడ్స్ వాటా అత్యధికంగా 26.67 శాతంగా ఉన్నది.
వీటి విలువ 116.67 బిలియన్ డాలర్లు. ఆ తర్వాత వ్యవసాయోత్పత్తులు 11.85 శాతం, ఎలక్ట్రానిక్స్ 8.82 శాతం, ఫార్మాస్యూటికల్స్ 6.96 శాతంగా ఉన్నాయి. అయితే వృద్ధిపరంగా 32.46 శాతంతో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24) 29.12 శాతంగానే ఉన్నది. కంప్యూటర్ హార్డ్వేర్ తదితరాలకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. యూఏఈ, అమెరికా, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇటలీ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయి. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ దేశాలకు భారత ఇంజినీరింగ్ గూడ్స్ ఎక్కువగా వెళ్లాయి.